ప్రధాన విషయమునకు వెళ్ళు

Bhagavad Gita: Chapter 1, Verse 2

సంజయ ఉవాచ ।దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ।ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ।। 2 ।।
సంజయ ఉవాచ — సంజయుడు పలికెను; దృష్ట్వా — గమనించిన పిదప; తు — కానీ; పాండవ-అనీకం — పాండవ సైన్యమును; వ్యూఢం — సైనిక వ్యూహ రచనతో నిలిచి యున్న; దుర్యోధనః — రాజైన దుర్యోధనుడు; తదా — అప్పుడు; ఆచార్యం — గురువు గారు; ఉపసంగమ్య — సమీపించి; రాజా — రాజు; వచనం — మాటలను; అబ్రవీత్ — పలికెను.
Translation

BG 1.2:సంజయుడు పలికెను: వ్యూహాత్మకంగా అమర్చబడిన పాండవ సైన్యాన్ని చూసిన రాజైన దుర్యోధనుడు, అప్పుడు తన గురువు ద్రోణాచార్యుడిని సమీపించి ఈ విధంగా పలికెను.

Commentary
కీలక పదం · Key Word
వ్యాకులత · Vyākulatā
ఆందోళన · భయం · మనోవేదన

తన పుత్రులు ఎలాగైనా యుద్ధం మొదలు పెడతారనే ధ్రువీకరణ కోసం ధృతరాష్ట్రుడు ఎదురు చూస్తున్నాడు. ఈ ప్రశ్న వెనకున్న ధృతరాష్ట్రుని ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న సంజయుడు, ఖచ్చితంగా యుద్ధం జరగబోతోందని, పాండవ సైన్యం యుద్ధానికి సిద్ధంగా సైనిక నిర్మాణంతో ఉందని చెప్పాడు. అంతేకాక దుర్యోధనుడు ఏమి చేస్తున్నాడనే దిశగా, సంభాషణ విషయాన్ని మరల్చాడు.

ధృతరాష్ట్రుడు
జన్మతః అంధుడైన ధృతరాష్ట్రుడు హస్తినాపుర రాజ్యాన్ని నేరుగా పాలించలేకపోయాడు. తన పుత్రులు యుద్ధంలో విజయం సాధిస్తారనే నిర్ధారణ కోసం నిరంతరం సంజయుని వద్ద అడుగుతూనే ఉన్నాడు.
దుర్యోధనుడు
దుష్ట, క్రూర స్వభావం కలిగిన దుర్యోధనుడే వాస్తవంగా హస్తినాపురాన్ని పాలించాడు. పాండవులను అడ్డు తొలగించుకొని రాజ్యాన్ని ఎదురు లేకుండా పాలించాలని నిశ్చయించుకున్నాడు.

ధృతరాష్ట్రుని పెద్ద కొడుకు అయిన దుర్యోధనుడు చాల దుష్ట, క్రూర స్వభావం కలవాడు. ధృతరాష్ట్రుడు అంధుడు అవటం వలన, అతని తరఫున, నిజానికి దుర్యోధనుడే హస్తినాపుర రాజ్యాన్ని పరిపాలించాడు. అతను పాండవ ద్వేషి. ఎలాగైనా పాండవులని అడ్డు తొలగించుకొని రాజ్యాన్ని ఎదురు లేకుండా పాలించాలని నిశ్చయించుకున్నాడు.

పరిణామం
తన సైన్యాన్ని ఎదుర్కోగలిగినంత సైన్యాన్ని పాండవులు సమీకరించుకోలేరు అని దుర్యోధనుడు అనుకున్నాడు. కానీ దానికి విరుద్ధంగా జరిగింది — అపారమైన పాండవుల సైనిక సామర్ధ్యాన్ని చూచి వ్యాకులతతో ఆందోళన చెందాడు.

దుర్యోధనుడు తన యుద్ధ-గురువు ద్రోణాచార్యుని సమీపించటం, యుద్ధ పరిణామం మీద అతనికి వున్న భయాన్ని తెలియపరుస్తోంది. నమస్కరించాలనే నెపంతో ద్రోణాచార్యుని దగ్గరకి వెళ్ళినా, అతని నిజమైన ఆంతర్యం తన ఆందోళనని ఉపశమనం చేసుకోవటమే.

ఈ ఇప్పుడు దుర్యోధనుడు తదుపరి శ్లోకంతో మొదలిడి తొమ్మిది శ్లోకాలని పలికెను.

కీలక పాత్ర · Key Figure
Droṇācārya
ద్రోణాచార్యుడు

ద్రోణాచార్యుడు కురు వంశంలోని యువకులందరికీ యుద్ధవిద్య నేర్పిన మహాగురువు. పాండవులు మరియు కౌరవులు — ఇరు పక్షాలకూ గురువుగా నిలిచిన ఆయన, ఆ రోజు కురుక్షేత్రంలో కౌరవ పక్షాన నిలబడ్డాడు.

దుర్యోధనుడు ద్రోణాచార్యుని సమీపించటంలో రెండు ఉద్దేశాలున్నాయి — గురువుకు విధేయత చూపడం మరియు తన ఆందోళనకు ఉపశమనం కోరటం. పాండవ సైన్య బలాన్ని చూసి కలిగిన భయాన్ని, గురువు సమక్షంలో వ్యక్తం చేయడానికి సంసిద్ధమవుతున్నాడు.

📢 ఈ జ్ఞానాన్ని పంచుకోండి / Share Devotion

భగవద్గీత యొక్క అమూల్యమైన జ్ఞానాన్ని మీ బంధుమిత్రులతో పంచుకోవడం ద్వారా సనాతన ధర్మ ప్రచారంలో భాగస్వాములు అవ్వండి.

ఈ పాఠ్యంలో ఏదైనా తప్పు లేదా పాఠాంతరం గమనించారా? తప్పులు మరియు సవరణలను తెలియజేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
భగవద్గీత 1వ అధ్యాయము - అర్జున విషాద యోగం దైవిక చిత్రం